భారత్‌లో పెరిగిన ధరలు, దిగుమతి సుంకం పెంపు వంటి కారణాలతో పసిడి డిమాండ్ గణనీయంగా తగ్గింది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం గిరాకీ గత ఏడాదితో పోలిస్తే 6 శాతం క్షీణించి 131.4 టన్నులకు పరిమితమైంది. అనవసర కొనుగోళ్లకు స్వస్తి పలకాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో పాటు, సీజనల్‌గా అమ్మకాలు మందగించడం కూడా ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2025 ఇదే కాలంలో ఈ డిమాండ్ 139.7 టన్నులుగా నమోదైంది.

కొనుగోళ్ల పరిమాణం తగ్గినప్పటికీ, విలువ పరంగా మాత్రం డిమాండ్ సరికొత్త రికార్డును సృష్టించింది. గతేడాది రూ. 1,32,500 కోట్లుగా ఉన్న డిమాండ్ విలువ, ఈసారి ఏకంగా 50 శాతం వృద్ధి చెంది రూ. 1,98,100 కోట్లకు చేరుకుంది. పసిడి ధరలు భారీగా పెరగడమే ఇందుకు కారణమని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్-ఇండియా సీఈవో సచిన్ జైన్ తెలిపారు. అధిక ధరలు కొనసాగుతున్నప్పటికీ, వినియోగదారులు ఇప్పటికీ స్వర్ణానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మొత్తం డిమాండ్‌లో కీలకమైన ఆభరణాల విక్రయాలు 15 శాతం తగ్గి 75.1 టన్నులకు పడిపోయాయి. కాగా, సురక్షిత పెట్టుబడిగా భావించే గోల్డ్ బిస్కెట్లు, నాణేల డిమాండ్ మాత్రం 9 శాతం పెరిగి 50.3 టన్నులకు చేరడం విశేషం. మరోవైపు, బంగారం దిగుమతులు 23 శాతం తగ్గి 98.1 టన్నులకు, రీసైక్లింగ్ ప్రక్రియ 17 శాతం క్షీణించి 19.2 టన్నులకు పరిమితమైంది. మే 2026లో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి ఏకంగా 15 శాతానికి పెంచిన విషయం విదితమే.