అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సైనిక విద్యా కోర్సులో భారత సైన్యానికి చెందిన మేజర్ ప్రభాత్ మిశ్రా సరికొత్త చరిత్ర సృష్టించారు. 22 కుమావోన్ రెజిమెంట్‌కు చెందిన ఆయన ప్రపంచంలోని 92 దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ సైనిక అధికారులను వెనక్కినెట్టారు. రెండు ప్రతిష్ఠాత్మక అకడమిక్ అవార్డులను కైవసం చేసుకున్నారు. అమెరికాలోని కాన్సాస్ ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో ఉన్న ‘యూఎస్ ఆర్మీ కమాండ్ అండ్ జనరల్‌ స్టాఫ్ కాలేజ్’ ఈ 10 నెలల లీడర్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది.

ఈ ఏడాది మొత్తం 951 మంది సైనిక అధికారులు ఈ అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేశారు. అందులో అమెరికా భాగస్వామ్య దేశాల నుంచి వచ్చిన 120 మంది అంతర్జాతీయ అధికారులు ఉన్నారు. మిలిటరీ స్టడీస్, రీసెర్చ్, లీడర్‌షిప్ రైటింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపినందుకుగానూ మేజర్ ప్రభాత్‌కు ఈ పురస్కారాలు దక్కాయి. ఈ కోర్సు ముగింపు వేడుకల్లో ఆయనకు ‘బిర్రర్-బ్రూక్స్ అవార్డు’ అందజేశారు. దాంతో పాటు ‘జనరల్ డగ్లస్ మెక్‌ఆర్థర్ మిలిటరీ లీడర్‌షిప్ రైటింగ్‌ అవార్డు’నూ ఇచ్చారు.

‘మల్టీపోలార్‌ వరల్డ్‌’లో భారత సైనిక వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనే అంశంపై ఆయన పరిశోధనా పత్రం సమర్పించారు. అవార్డుల ఎంపికలో ఈ థీసిస్ ప్రత్యేకంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ సైనిక విద్యాసంస్థ 1894 నుంచి అంతర్జాతీయ మిలిటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 170 దేశాలకు చెందిన 8,700 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందారు. మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా చురుకైన, వినూత్నమైన నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.