సూపర్‌స్టార్‌ కృష్ణ కుమారుడు రమేష్‌బాబు తనయుడు 'జై కృష్ణ' హీరోగా ఎంట్రీ ఇస్తూ రూపొందిన చిత్రం ' శ్రీనివాస మంగాపురం'  రవీనా టాండన్‌ కూతురు రాషా తడాని ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు.  అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జై కృష్ణకు విజయాన్నిఅందించిందా? 'శ్రీనివాస మంగాపురం'లో ప్రేక్షకులను అలరించే అంశాలున్నాయా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

తిరుపతిలో పెద్దిరెడ్డి ('కిక్‌' శ్యామ్‌) అంటే అందరికి హడల్‌. ఆయన కూతురు మంగా (రాషా తడాని)ని చూసి ప్రేమలో పడతాడు శ్రీను అలియాస్‌ వాసు బాబు (జై కృష్ణ). శ్రీను రోజు ఆమెను ఫాలో అవుతుంటాడు. ఆమె తనకు ఇష్టం లేదని చెప్పిన వినిపించుకోడు. అనుకోకుండా ఆమెకు ఒకరోజు నాటకం రిహార్సల్‌లో శ్రీను సహాయం చేస్తాడు. ఈ క్రమంలో ఆమెతో చనువు పెంచుకుని ప్రేమలో పడేయాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ అప్పటికే మంగాకి పెళ్లి కుదరటంతో పాటు శ్రీను ఆమె నిశ్చితార్థానికి కూడా వెళ్లతాడు. అయితే ఒకరోజు మంగాని తిరుపతి సమీపంలోని కొండ మీదికి తీసుకెళ్లి తను ప్రేమిస్తున్న విషయాన్ని చెబుతాడు శ్రీను. కానీ శ్రీను ప్రేమను, మంగ తిరస్కరిస్తుంది. 

ఇది తెలుసుకున్న పెద్ది రెడ్డి మనుషులు శ్రీనుపై దాడిచేయాలని చూస్తారు. అయితే అనుకోకుండా ఆ సమయంలోనే పెద్ది రెడ్డి మనుషులపై దాడి చేయాలనుకున్న అజయ్‌ అండ్‌ గ్యాంగ్‌ నుంచి పెద్దిరెడ్డి మనుషులను శ్రీను రక్షిస్తాడు. అయితే పెద్ది రెడ్డి చెల్లెలు వెళ్లి తన మేనకోడలిని వదిలేయమని శ్రీనుకు చెబుతుంది. అంతేకాదు ఈ క్రమంలో శ్రీనును  అసలు పేరు వాసుబాబు అని పిలుస్తుంది. ఇక ఈ వాసు బాబు శ్రీనుగా ఎందుకు మారాడు? ఈ కథకు వెంకటప్పయ్య నాయుడు (మోహన్‌ బాబు)కు ఉన్న సంబంధమేమిటి? శ్రీను తిరుపతికి ఎందుకొచ్చాడు? శ్రీను, మంగ ప్రేమకథ ఏమిటి? వీరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతాకథ. 


సినిమా నేపథ్యం ఉన్న వారసుడిని హీరోగా పరిచయం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కథలో కొత్తదనం ఉండాలి. కథనంలో వేగం ఉండాలి. ఇక ఈ కథ ప్రేమకథ అయితే మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలకు, చెబుతున్న ప్రేమకథకు మధ్య వైవిధ్యత ఉండాలి. లేకపోతే ఆ ప్రేమకథ రొటిన్‌ అయిపోతుంది. ప్రేక్షకులు రొటిన్‌ ప్రేమకథలపై ఏ మాత్రం ఆసక్తి చూపారు. సరిగ్గా 'శ్రీనివాస మంగాపురం' విషయంలో ఇదే జరిగింది. రొటిన్‌, రెగ్యులర్‌ మూస ఫార్ములాతో అజయ్‌ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను విసిగించడమే కాకుండా, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు రొటిన్‌గా అనిపించడమే ఈ చిత్రానికి ఉన్న అతిపెద్ద మైనస్‌. రెగ్యులర్‌ రొటిన్‌ స్టోరీ, ఏ మాత్రం ఆసక్తి కలిగించని సన్నివేశాలు, మచ్చుకైనా కనిపించని కొత్తదనం వెరసి 'శ్రీనివాస మంగాపురం'ను ఓ బోరింగ్‌ రొటిన్‌ సినిమాగా మార్చేసింది. 

సినిమా ఆద్యంతం మూస ఫార్ములాలోనే కొనసాగుతుండటంతో ఎక్కడా కూడా వాట్‌ నెక్ట్స్‌ అనే ఆసక్తి ఆడియన్స్‌లో కనిపించదు.   ఆడియన్స్‌  ముందే ఊహించగలిగే సన్నివేశాలతో నిదానంగా సాగుతున్న  కథలో ఎక్కడైనా  ఎప్పుడైనా కథ కొత్త మలుపు తిరుగుతుందేమో అని ఎదురు చూస్తాం కానీ... మొదటి నుంచి చివరి వరకు ఎన్నోసార్లు చూసిన అదే పాత బాటలోనే సాగుతుంది. స్క్రీన్‌ప్లే ఎటు పోతుందో అర్థం కాకుండా ఉంటుంది. రచనలో కొత్తదనం లేకపోవడంతో పాటు, సందర్భం లేకుండా వచ్చే పాటలు కథలో ఉన్న బలహీనతలను మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. 

కథలో ఎమోషన్స్‌ పండకపోవడంతో ప్రేక్షకుడు ఏ పాత్రతో కనెక్ట్‌ కాలేడు. ఈ చిత్రంలో ప్రేమకథను చూస్తున్నప్పుడు మనకు ఇంతకు ముందు చూసిన ప్రేమకథలు గురొస్తాయి.దీంతో ఈ ప్రేమకథను ఎవరి హృదయానికి హత్తుకోదు. కథ, కథనాలు ఏ దశలోనూ ఆసక్తి కలిగించకుండా అత్యంత పేలవంగా ఓ మూస ఫార్ములా ప్రకారమే సినిమా ఆద్యంతం కొనసాగింది.

స్క్రీన్ మీద జై కృష్ణ లుక్‌ బాగుంది. కానీ యాక్టింగ్ పరంగా ఇంకాస్త బెటర్‌ అవ్వాల్సిందే. తొలిచిత్రంతో నటుడిగా జై కృష్ణ ఎక్కడా డిజప్పాయింట్‌ చేయకపోయినా, బలమైన కథతో వచ్చి ఉంటే జై కృష్ణ పూర్థి స్థాయిలో తన నటన పటిమను ఫ్రూవ్‌ చేసుకునే వాడు. కానీ ఈ సినిమా ఆయనకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. రషా తడానీ క్యూట్‌గా ఉంది. వెంకటప్ప నాయుడుగా మోహన్‌బాబు పాత్ర కథనాన్ని పరుగులు పెట్టించి. ఆయన పాత్ర వెండితెరకు పెద్దరికాన్ని తీసుకొచ్చింది. 

స్వతంత్ర బాబు పాత్రలో నరేష్‌ వినోదం పండించే ప్రయత్నం చేశాడు. అజయ్‌, వాసుకిలు వాళ్ల పరిధి మేరకు నటించారు. జయకృష్ణ గుమ్మడి ఫోటోగ్రఫీ విజువల్స్‌ బాగున్నాయి. జీవీ ప్రకాష్‌ కుమార్‌ పాటల, నేపథ్య సంగీతం పరవాలేదు. అజయ్‌ భూపతి రచన ఈ సినిమాకు పెద్ద మైనస్‌.