భారతదేశంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య.. ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతోందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం, భారతదేశంలో సుమారు 4.2 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఈ వ్యాధి.. ఇప్పుడు పిల్లలు, పురుషుల్లో కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే థైరాయిడ్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని అంటున్నారు.
ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం థైరాయిడ్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి.
-
హైపోథైరాయిడిజం
-
హైపర్ థైరాయిడిజం
ఈ రెండింటి లక్షణాలు వేర్వేరుగా ఉంటాయి. ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
థైరాయిడ్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం
ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి:
పప్పులు, పనీర్, గుడ్లు, పెరుగు, చేపలు, చికెన్ వంటి ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇవి శరీరానికి శక్తినిచ్చి అలసట తగ్గించడంలో సహాయపడతాయి.
సెలీనియం, జింక్ అవసరం:
గుమ్మడికాయ గింజలు, నట్స్, సముద్ర ఆహారం, తృణధాన్యాల్లో ఉండే సెలీనియం, జింక్ థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యం చేయడంలో ఉపయోగపడతాయి.
అయోడిన్ మితంగా తీసుకోవాలి:
అయోడిన్ శరీరానికి అవసరం. కానీ ఎక్కువగా తీసుకుంటే హానికరం కావచ్చు. అందుకే అయోడైజ్డ్ ఉప్పును మితంగా వాడాలి.
జంక్ ఫుడ్ తగ్గించాలి:
కూల్ డ్రింక్స్, ప్యాకెట్ స్నాక్స్, ఎక్కువ చక్కెర ఉన్న పదార్థాలు, బాగా వేయించిన ఆహారాలు తినడం తగ్గించాలి. ఇవి బరువు పెరగడం, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడానికి కారణమవుతాయి.
పేగుల ఆరోగ్యాన్ని కాపాడాలి:
పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది థైరాయిడ్ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. మందులతో పాటు సరైన ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం, క్రమం తప్పని థైరాయిడ్ పరీక్షలు కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
