అమెరికాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ టెక్నాలజీ సంస్థ ఓపెన్‌డోర్‌ భారత్‌లోని తన ఉద్యోగులందరినీ తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 250 మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. కంపెనీ సీఈవో కాజ్‌ నెజాటియన్‌ ఉద్యోగులకు పంపిన సందేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లోని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా కార్యకలాపాలను అమెరికాకు తరలిస్తున్నామని, ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయినట్లు  పేర్కొంది. దీంతో భారత్‌లో ఉన్న మొత్తం వర్క్‌ఫోర్స్‌పై ప్రభావం పడనుంది.

కంపెనీ కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారని, వారికి సంబంధించిన కార్యకలాపాలు కూడా అక్కడే నిర్వహించడం సమర్థంగా ఉంటుందని భావించినట్లు నెజాటియన్‌ పేర్కొన్నారు. గతంలో పలు మాన్యువల్‌ ప్రక్రియలను నిర్వహించేందుకు భారత్‌లో పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం సాంకేతికత గణనీయంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో గతంలో మనుషులు చేసిన అనేక పనులను ఇప్పుడు తక్కువ సిబ్బందితో నిర్వహించగలుగుతున్నట్లు వివరించారు.

ఈ నిర్ణయం ఉద్యోగుల పనితీరుతో సంబంధం లేదని నెజాటియన్‌ స్పష్టం చేశారు. భారత్‌లోని ఉద్యోగులు ప్రతిభావంతులని, వారు ఇతర సంస్థలకు విలువైన ఆస్తిగా నిలుస్తారని అన్నారు. కంపెనీ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని కొనియాడారు. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి పరిహారంతో పాటు కొత్త ఉద్యోగాల కోసం సాయం, ఇతర మద్దతు కార్యక్రమాలు అందించనున్నట్లు తెలిపారు. కీలక పనుల బదిలీ పూర్తయ్యే వరకు కొంతమంది ఉద్యోగులు తాత్కాలికంగా కొనసాగనున్నారని వెల్లడించారు.