విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ వ్యవహారాల్లో చిన్ని పాత్రపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశారు.
కేశినేని నాని తన లేఖలో, లిక్కర్ స్కామ్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డితో కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. "ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP" సంస్థలో చిన్ని దంపతులు భాగస్వాములుగా ఉన్నారని, ఆ సంస్థకు స్కామ్‌లోని కీలక వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
అంతేకాకుండా, రియల్ ఎస్టేట్, హవాలా లావాదేవీలు, థర్డ్ పార్టీ ఒప్పందాల పేరుతో భారీ మొత్తంలో నిధులు విదేశాలకు తరలించారని నాని ఆరోపించారు. దుబాయ్, అమెరికా వంటి దేశాల్లో అక్రమ పెట్టుబడులు పెట్టిన అంశాన్ని కూడా ఈడీ దర్యాప్తు చేయాలని కోరారు.
ఇక ఈ ఆరోపణలను కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్నవి పూర్తిగా నిరాధార ఆరోపణలేనని, లిక్కర్ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నాని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అవసరమైతే సీబీఐ లేదా ఏ దర్యాప్తు సంస్థ విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. అలాగే నానిపై పరువు నష్టం కేసు కూడా వేశారు.
ఇదిలా ఉండగా, లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన విచారణలో భాగంగా కేశినేని చిన్ని భార్య జానకిలక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో నాని చేసిన ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
