నాగ్‌పూర్‌కు చెందిన ఒక రిటైర్డ్ బ్యాంకర్ చూపిన ఉదారత, ఆయనలోని భార్యపై ఉన్న అజరామరమైన ప్రేమ ఎందరో హృదయాలను కదిలిస్తున్నాయి. తన దివంగత భార్యతో కలిసి ప్రపంచ యాత్ర చేయాలన్న కలను నెరవేర్చుకోవడానికి దాచుకున్న సొమ్ము నుంచి రూ. 25 లక్షల మొత్తాన్ని ఆయన భారత సైన్యానికి విరాళంగా ఇచ్చారు. వ్యక్తిగత విషాదాన్ని ఒక స్ఫూర్తిదాయక చర్యగా మార్చిన ఆయన కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శ్రీకాంత్ సహస్రబుద్ధే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేసి రిటైర్ అయ్యారు. తన భార్యతో కలిసి రిటైర్మెంట్ తర్వాత తమ పొదుపు, పీఎఫ్ డబ్బుతో ప్రపంచమంతా చుట్టి రావాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే, పదేళ్ల క్రితం ఆయన భార్య అనారోగ్యంతో మరణించడంతో వారి కల చెదిరిపోయింది. ఈ విషయం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. "నా భార్య, నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యాం. ఆమె చనిపోయాక, ఎక్కడికీ ప్రయాణించాలనే కోరిక నాకు లేకుండా పోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఇటీవల అకోలాకు చెందిన ఒక వ్యక్తి రూ. కోటి విరాళం ఇచ్చినట్లు వాట్సాప్‌లో వచ్చిన సందేశం తనను ఆలోచింపజేసిందని శ్రీకాంత్ తెలిపారు. "నా దగ్గర అంత సంపద లేదు. కానీ నేను రూ. 25 లక్షలు ఇవ్వగలనని అనుకున్నాను. మా ప్రపంచయాత్ర కోసం దాచిన డబ్బులో సగం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. బహుశా, నా భార్యతో కలిసి ప్రయాణిస్తే నాకు ఎంత ఆనందం లభించేదో, ఈ దానంతో అంతే సంతోషం దొరుకుతుందేమో" అని ఆయన అన్నారు.
విరాళం ఇస్తున్నప్పుడు తన కన్నీళ్లు ఆగలేదని (ఆన్సూ నహీ రుక్ రహా థా) చెబుతూ శ్రీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్యను తానెంతగా మిస్ అవుతున్నారో గుర్తుచేసుకున్నారు.
శ్రీకాంత్ సహస్రబుద్ధే కథ సోషల్ మీడియాలో ఎందరినో కదిలించింది. "ఆయన గొప్ప మనిషి, సైన్యానికి విరాళం ఇవ్వాలన్న ఆయన నిర్ణయానికి సెల్యూట్" అని ఒకరు కామెంట్ చేయగా, "ఆయన మాటల్లో జీవితకాలపు ప్రేమ, నష్టం ఉన్నాయి. ఈ గొప్ప చర్యతో ఆయనకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను" అని మరొకరు రాశారు. చెదిరిన కలల బాధ ఉన్నా, స్ఫూర్తిని నింపాలనే ఆయన సంకల్పం గొప్పదని పలువురు ప్రశంసిస్తున్నారు.
చనిపోయిన భార్యపై ప్రేమకు గుర్తుగా.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఉదారత.. కన్నీళ్లు పెట్టిస్తున్న కథ..
