ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరలోనే తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కేవలం మరికొన్ని రోజుల్లోనే కుదిరే అవకాశముందని ఆయనకు తెలిపినట్లు యాక్సియోస్ కథనం వెల్లడించింది. ‘‘ఇది మంచి ఒప్పందం.. యుద్ధాన్ని ముగించే సమయం వచ్చేసింది’’ అని నెతన్యాహుకు ట్రంప్ చెప్పినట్లు సమాచారం.
అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఇరు దేశాల అధికారులు చెబుతున్నారు. గతంలో ఇరాన్‌లో పాలన మార్పే లక్ష్యమని వాదించిన నెతన్యాహు.. ఇప్పుడు ట్రంప్ ముందుకు తీసుకెళుతున్న ఒప్పందాన్ని అడ్డుకోలేమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ఆందోళనలను ఒప్పందంలో పరిగణనలోకి తీసుకుంటారని ట్రంప్‌పై తనకు నమ్మకం ఉందని ఆయన చెప్పినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ప్రతిపాదిత ఒప్పందంపై ఇజ్రాయెల్ పూర్తిగా సంతృప్తిగా లేదని సమాచారం. ఆంక్షల సడలింపుతో ఇరాన్ చమురు విక్రయాలు పెంచుకొని ఆర్థికంగా బలపడొచ్చని, అదే సమయంలో అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకపోవచ్చని ఇజ్రాయెల్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ.. అమెరికా తన ప్రయోజనాల దృష్ట్యా ఒప్పందం కుదుర్చుకుంటున్నప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణులు, అనుబంధ తీవ్రవాద సంస్థల విషయంలో తమ భద్రతా ఆందోళనలు కాపాడాలని ఆశిస్తున్నామని చెప్పారు.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం అమెరికా-ఇరాన్ మధ్య త్వరలో ఓ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరే అవకాశం ఉంది. ఇందులో 60 రోజుల కాల్పుల విరమణ, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, అణు కార్యక్రమంపై తదుపరి చర్చలకు మార్గం సుగమం చేసే అంశాలు ఉండనున్నాయి. అలాగే హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవడం, ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది.
యుద్ధాన్ని ముగించేందుకు సమయం ఆసన్నమైంది మిత్రమా!: నెతన్యాహుతో ట్రంప్..
