పతంజలి టూత్‌పేస్ట్, నెయ్యి, ఫేస్‌వాష్ వంటి ఉత్పత్తులను మీరు కొనే ఉంటారు. కానీ త్వరలోనే పతంజలి ఇన్సూరెన్స్ పాలసీని కూడా కొనుగోలు చేసే అవకాశం రాబోతోంది. యోగా గురువు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్ సంస్థ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), ఆయుర్వేద రంగాల నుంచి ఆర్థిక సేవల రంగంలోకి అతిపెద్ద అడుగు వేసింది. మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని కొనుగోలు చేసేందుకు పతంజలికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆమోదం తెలిపింది.

దాదాపు రూ. 4,500 కోట్ల విలువైన ఈ కొనుగోలును పతంజలి.. ఆహార, మిఠాయి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన డీఎస్ గ్రూప్‌తో కలిసి సంయుక్తంగా చేపడుతోంది. ఈ ఒప్పందం ప్రకారం, మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్‌లో పతంజలి 73.56 శాతం వాటాను, డీఎస్ గ్రూప్ 24.5 శాతం వాటాను సొంతం చేసుకుంటాయి. ప్రస్తుత వాటాదారులైన అదార్ పూనావాలా గ్రూప్‌కు చెందిన సనోటి ప్రాపర్టీస్ ఎల్ఎల్‌పి నుంచి దాదాపు 98 శాతం వాటాను ఈ రెండు సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. ఐఆర్‌డీఏఐ ఆమోదం మూడు నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈలోగా ఈ లావాదేవీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు ఆయుర్వేద ఉత్పత్తులు, పర్సనల్ కేర్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు మాత్రమే పరిమితమైన పతంజలి, ఆర్థిక సేవల రంగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. కొత్తగా ఇన్సూరెన్స్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే బదులు, ఇప్పటికే మోటార్, హెల్త్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న మాగ్మాను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో తమకు ఉన్న విస్తృతమైన రిటైల్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఇన్సూరెన్స్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని పతంజలి భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ గత కొన్నేళ్లుగా తన వ్యాపారాన్ని స్థిరంగా విస్తరిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 3,615.48 కోట్ల స్థూల ప్రీమియం ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 3,334.4 కోట్లుగా ఉంది. ఈ డీల్ గడువులోగా పూర్తయితే, భారత జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమలో పతంజలి అధికారికంగా సరికొత్త సంస్థగా అవతరించనుంది.