ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్ల తొలి ప్రాధాన్యతగా మారిందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, ఈక్యూటీ, టీపీజీ వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్‌లు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయ‌ని, టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల తమ కార్యకలాపాలను ఇక్కడ విస్తరిస్తున్నాయని ఆయన వెల్ల‌డించారు. పత్తికొండ సమీపంలోని హోసూరు వద్ద టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) ఆధ్వర్యంలో రూ.5,350 కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు గురువారం మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే ఈ ఒక్క ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగింద‌ని, రాష్ట్ర‌ ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయత వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. 

పెట్టుబ‌డిదారుల్లో న‌మ్మ‌కం పెంపొందించాం

"రాష్ట్రంలో 2024 జూన్ లో  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, పునరుత్పాదక ఇంధన రంగం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండేది. అంతకుముందు ఐదేళ్లలో కనీసం ఒక్క మెగావాట్ సామర్థ్యం గల ప్రధాన రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేశారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింది. ప్రపంచంలోని అనేక అతిపెద్ద ఇన్‌ఫ్రా, క్లైమెట్ ఫండ్స్ ఆంధ్రప్రదేశ్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాయి. ఒకసారి దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం రాత్రికి రాత్రే  సాధ్యంకాదు. పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని పెంపొందిస్తూ వ‌చ్చాం" అని పేర్కొన్నారు.


ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో తొలిఅడుగు

ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ - 2024ను ప్రవేశపెట్టి విస్తృతమైన విజ‌న్‌తో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని అన్నారు. సోలార్ మాడ్యూల్స్, సెల్స్ నుండి బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ట్రాన్స్ మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, స్టోరేజీ సిస్టమ్స్..  ప్రపంచ స్థాయి తయారీ వరకు - మొత్తం క్లీన్ ఎనర్జీ సప్లయ్ చైన్ ను ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని అనుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వ‌చ్ఛ‌ ఇంధనాన్ని వినియోగించుకోవడమే కాకుండా, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలకు గ్లోబల్ ప్రొడ్యూసర్ గా మారాలనే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నామని లోకేష్ తెలిపారు.

టాటా రెన్యువబుల్ ప్రాజెక్ట్.. మా విజన్ కు నిదర్శనం

"టాటా రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ  ప్రాజెక్ట్ రూ. 5,750 కోట్ల పెట్టుబడితో, పత్తికొండలో 400 మెగావాట్ల సౌర విద్యుత్‌ను, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్‌తో కలిపి, 800 మెగావాట్ల హైబ్రిడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుగా అవతరించబోతోంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో దాదాపు 4,000 ఉద్యోగాలను కల్పిస్తుంది. 3,400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో గల ఈ ప్రాజెక్టు ద్వారా 1,100 పైగా రైతు కుటుంబాలకు దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థిరమైన కౌలు ఆదాయాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌పైనా, మా పరిపాలనపైనా విశ్వాసానికి ప్రతీక.

టాటా గ్రూప్ తో మాకు ప్రత్యేకమైన అనుబంధం

టాటా గ్రూప్‌తో మాకు దశాబ్దాల తరబడి అనుబంధం ఉంది. 1990లో నా తండ్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్‌లో 'హైటెక్ సిటీ'ని నిర్మిస్తున్నప్పుడు, ఆయన దార్శనికతను నమ్మిన మొట్టమొదటి సంస్థలలో టిసిఎస్ ఒకటి. ఆ నమ్మకంతో కూడిన అనుబంధం నేటికీ కొనసాగుతోంది. 2024లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌ను క‌లిసి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ భిన్నంగా ఏమి చేయాలి అని అడిగాను. "వేగంపై దృష్టి పెట్టండి. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాల కంటే జాప్యం వల్ల కలిగే నష్టమే ఎక్కువ," అని ఆయన చెప్పారు. మా ప్ర‌భుత్వ విధానం కూడా సింపుల్, స్పీడ్, స్టేబిలిటీలో భాగం అయ్యింది. శంకుస్థాపన నుండి ప్రారంభోత్సవం వరకు ప్రభుత్వం మ‌ద్ద‌తుగా నిలబడుతుందనే విశ్వాసం మేము పెట్టుబ‌డిదారుల‌కు క‌ల్పిస్తున్నాం" అని అన్నారు.

స్వ‌చ్ఛ ఇంధ‌నం ఎగుమ‌తి చేస్తాం

"భారతదేశంలోనే అత్యంత పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా పునరుత్పాదక వనరులు, ప్రపంచ స్థాయి ఓడరేవులు ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు భారతదేశపు ముఖద్వారంగా మారడానికి మాకు అవకాశం కల్పిస్తున్నాయి. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే స్వచ్ఛమైన ఇంధనాన్ని తీసుకువెళ్లే ఓడలు యూరప్, జపాన్, కొరియా,  ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. క్లీన్ మాలిక్యులస్, గ్రీన్ ఫ్యూయల్స్, సాంకేతికతలను ఎగుమతులూ ఏపీ నుంచి చేసే స్థాయికి చేర‌తాం. 

సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో క‌లిసి ప‌నిచేయాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఐటి తిరుపతి, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా) సహకారంతో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ టెక్నాలజీల కోసం ఏర్పాటు చేస్తున్న ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో క‌లిసి ప‌నిచేయాల‌ని టాటా పవర్‌ను ఆహ్వానిస్తున్నాం. మనం కలిస్తే భారతదేశపు స్వచ్ఛ ఇంధన భవిష్యత్తును నిర్మించే ఇంజనీర్లు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయగలం. టాటా రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ కార్య‌రూపం దాల్చ‌డానికి కృషి చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. 

సుజ్లాన్ కు ప్రత్యేక అభినందనలు

 దశాబ్దాలుగా, భారతదేశ పవన శక్తి రంగంలో సుజ్లాన్ అగ్రగామి పాత్ర పోషిస్తున్న సుజ్లాన్‌ పవన శక్తి ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగం కావ‌డం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం అవసరమైన విండ్ టర్బైన్‌లను అనంతపురంలోనే సుజ్లాన్ ఏర్పాటు చేసిన కేంద్రంలో త‌యారు కావ‌డం ఏపీలో సమగ్ర పారిశ్రామిక వ్యవస్థ అభివృద్ధికి మరో నిదర్శనం. విండ్ టర్బైన్‌ల త‌యారీ, నిర్వహణలో యువతకు నైపుణ్య శిక్షణనిచ్చే కేంద్రాలను కూడా ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో దీర్ఘకాలిక భాగస్వామిగా నిలిచినందుకు సుజ్లాన్ యాజ‌మాన్యం, బృందానికి కృత‌జ్ఞ‌త‌లు. 

వ‌జ్రాల నేల‌..బంగారంలాంటి ప్ర‌జ‌లు

అశోకుడు పాలించిన గొప్ప నేల పత్తికొండ. పత్తికొండలో యువశక్తి అదిరిపోయింది. బంగారు గనులు ఉన్న ప్రాంతం ఇది, బంగారం లాంటి ప్రజలు ఉన్న నేల ఇది.  జొన్నగిరి గోల్డ్ ఇప్పుడు ఏపీకే బ్రాండ్. పత్తికొండ బంగారం గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఈ నేలలో వజ్రాలు దొరుకుతాయి, వజ్రాల లాంటి యువకులు ఇక్కడ ఉన్నారు. పెరవలి రంగనాథ‌ స్వామి ఆలయం, పత్తికొండ సాయిబాబా ఆలయం ఉన్న పుణ్య భూమి పత్తికొండ" అని మంత్రి పేర్కొన్నారు.

కర్నూలు ప్రజల అభిమానం మరువలేను

"ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే నాకు ఇష్టం. నేను పాదయాత్రలో వచ్చినప్పుడు ప్రజలు చూపిన ప్రేమ ఎప్పటికి మ‌ర్చిపోలేను. నేను 45 రోజులు, 14 నియోజక వర్గాల్లో పాదయాత్ర చేసాను. నాకు కర్నూలు జిల్లా ప్రజల స‌మ‌స్య‌లు తెలుసు, క‌ష్టాలు, వలసలు నేను చూశాను. నేను పత్తికొండ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం నన్ను అడ్డుకోవడానికి 1000 మంది పోలీసులను పంపింది. పత్తికొండ ప్రజలు నాకు మద్దతుగా నిలిచారు. అందుకే మీ రుణం తీర్చుకుంటున్నా. ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధిని బాధ్యతగా తీసుకున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, మంత్రి టిజి భరత్ ప్రపంచం మొత్తం తిరిగి రాష్ట్రానికి అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం. కర్నూలు జిల్లాకు కూడా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. పరిశ్రమలు తీసుకురావం మా బాధ్యత. కానీ కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత యువకులపై ఉంది.  కష్టం, ప్రతిభ రెండూ ఉండాలి. అప్పుడే కంపెనీలకు నమ్మకం వస్తుంది" అని అన్నారు.

ఇండస్ట్రీ కనెక్ట్ తో నైపుణ్యాభివృద్ధి

"నాకు ఒక వింత పరిస్థితి ఎదురవుతోంది. మేము కంపెనీ పెట్టడానికి సిద్దంగా ఉన్నాం, మీ దగ్గర స్కిల్ ఉన్న యూత్ ఉన్నారా అని కొంతమంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు ఐటిఐలని ఇండస్ట్రీతో కనెక్ట్ చేస్తున్నాం. ఒక్కో ఐటీఐని ఒక్కో కంపెనీకి అటాచ్ చేస్తున్నాం. ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా యూత్ ని సిద్దం చేస్తున్నాం. మొన్నే శ్రీసిటీలో యూనివర్సిటీని ప్రారంభించాను. ఇది ఇండియాలోనే నేర్చుకోండి - సంపాదించండి – గ్రాడ్యుయేట్ అవ్వండి మోడ‌ల్‌లో నిర్వ‌హించే తొలి యూనివ‌ర్సిటీ. మూడు నెలలు క్లాస్ రూములో, 8 నెలలు ఇండస్ట్రీ లో వర్క్. చదువుకుంటూనే సంపాదిస్తారు. చదువు పూర్త‌య్యేసరికి ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు సంపాదిస్తారు" అని లోకేష్ వ్యాఖ్యానించారు.

దేశానికి నాయకత్వం వహించే ఏపీని నిర్మిద్దాం

'టాటా' అనే పేరు ఎల్లప్పుడూ నమ్మకం, నిజాయితీ, దేశ నిర్మాణం, ఆవిష్కరణలకు మారుపేరుగా నిలిచిందని లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో టాటా బంధం చాలా బ‌లీయ‌మైన‌దని అన్నారు. ప్రభుత్వం, పారిశ్రామిక రంగం, రైతులు, ప్రజలు క‌లిసి క్లీన్ ఎనర్జీ, పరస్పర విశ్వాసం, భాగస్వామ్య స్ఫూర్తితో కూడిన స‌రికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నామని అన్నారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసే ఆంధ్రప్రదేశ్‌ను, స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రపంచానికే నాయకత్వం వహించే భారతదేశాన్ని మనం కలిసి నిర్మిద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టాటా పవర్ సిఇఓ & ఎండి ప్రవీర్ సిన్హా, టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ సిఇఓ & ఎండి సంజయ్ బంగా, సుజలాన్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి, భారీ పరిశ్రమల మంత్రి టిజి భరత్, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కె.ఇ. శ్యామ్ బాబు, జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, టాటా పవర్, సుజ్లాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.