ముంబైకి చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ చేపట్టిన వినూత్న ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో గంట వ్యవధిలో 100 మంది భారతీయులను గుర్తించాలనే సవాలును ఆయన కేవలం 48 నిమిషాల్లోనే పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ప్రన్నయ్ జోషి అనే ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ ఆసక్తికరమైన సవాలును స్వీకరించాడు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన టైమ్స్ స్క్వేర్‌లో రాత్రి 9:57 గంటలకు తన కౌంట్‌డౌన్‌ను ప్రారంభించాడు. ఆయన మొదటగా పలకరించిన 12 మంది బృందం భారతీయులే కావడంతో ఈ ప్రక్రియకు గొప్ప ఆరంభం లభించింది.

అనంతరం ఆయన జనసమూహంలో తిరుగుతూ, అక్కడి కుటుంబాలను, పర్యాటకులను "మీరు భారతీయులా?" అని అడుగుతూ ముందుకు సాగాడు. కేవలం 15 నిమిషాల్లోనే 32 మందిని గుర్తించగా, అదే ఉత్సాహంతో 48 నిమిషాల్లోనే 100 మంది లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఈ సవాలుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో భారతీయుల ఉనికి ఎంత బలంగా ఉందోనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.