శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు వైసీపీ అధినేత జగన్ పర్యటించిన సందర్భంగా జిల్లా జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జగన్ పర్యటనకు సంబంధించి రోడ్‌షోలు, జనసమీకరణ చేయకూడదని పోలీసులు విధించిన నిబంధనలు, ఆంక్షలను వైసీపీ నేతలు, కార్యకర్తలు ధిక్కరించారు.

 

మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్‌మనోహర్ నాయకత్వంలో భారీగా తరలివచ్చిన శ్రేణులు... జైలుకు కిలోమీటరు ముందు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించాయి. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు పోలీసులతో ఘర్షణకు దిగడమే కాకుండా దాడికి యత్నించాయి. ఆముదాలవలస ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ విధుల్లో ఉన్న మహిళా ఎస్‌ఐపై దురుసుగా ప్రవర్తించి, ఆమెను నెట్టివేయడం సంచలనం రేపింది.

 

కార్యకర్తల అత్యుత్సాహం, ఆంక్షల ఉల్లంఘనతో వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి, తోపులాటకు దిగిన వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.