వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేసిన బైక్ యాక్సిడెంట్‌లో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన కేసులో అరెస్టయిన అప్పలరాజును వైసీపీ అధినేత జగన్ పరామర్శించడంపై ఏపీ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడి కుటుంబాన్ని వదిలేసి, నిందితులను జగన్ పరామర్శించడం దారుణమని మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి మండిపడ్డారు.

 

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... "క్రిమినల్ మైండ్‌సెట్ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో చెప్పేందుకు జగనే ప్రత్యక్ష నిదర్శనం. గతంలో అనేక ప్రమాదాల్లో బాధితులను పట్టించుకోని జగన్.. ఇప్పుడు హంతకులకు, రౌడీలకు నేరుగా క్లీన్ చిట్ ఇస్తూ నేరస్తులకు వంతపాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అని పిలుపునిచ్చారు.

 

మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ... జగన్ వస్తున్నారంటే చనిపోయిన గొర్రెల కాపరి కుటుంబాన్ని పరామర్శిస్తారేమో అని ఆశపడితే సీన్ రివర్స్ అయిందన్నారు. బాధితులను కాకుండా చంపిన వారిని పరామర్శించడమే ఆ పార్టీ నేర ప్రవృత్తికి నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.

 

మరోవైపు, పలాసలో జగన్ పర్యటన సందర్భంగా హైవేపైకి వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముందస్తు అనుమతులు లేకపోవడంతో జామి, డెంకాడ ప్రాంతాల వద్ద కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.