తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కుటుంబ రిజిస్టర్ సర్టిఫికెట్ (ఎఫ్ఆర్‌సీ) జారీ ప్రక్రియలో జాప్యం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న రెండు పనిదినాల్లోనే ధ్రవీకరణ పత్రం అందజేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గడువు పాటించకపోవడంతో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.

ఈ పథకం ప్రారంభమైన జూలై 27 నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా 50 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. తొలిరోజే దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఇప్పటివరకు సర్టిఫికెట్లు అందకపోవడంతో, వారు నిత్యం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

గత నెల 25న విడుదల చేసిన జీవో 172 నిబంధనల ప్రకారం, దరఖాస్తు అందిన రెండు పనిదినాల్లోగా సంబంధిత తహశీల్దార్లు వాటిని పరిశీలించి సర్టిఫికెట్లను జారీ చేయాలి. అయితే, పలు ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు.

సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ఇదే

పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్న రేషన్ కార్డుల సమాచారం ఆధారంగా ప్రభుత్వం 'తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్'ను సిద్ధం చేసింది. పౌరులు మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోగానే, ఆ దరఖాస్తు నేరుగా సంబంధిత తహశీల్దార్ లాగిన్‌లోకి వెళ్తుంది. అక్కడ తహశీల్దార్ ఆ వివరాలను రేషన్ కార్డు డేటాతో సరిపోల్చి చూసి, అంతా సక్రమంగా ఉంటే డిజిటల్ సంతకంతో ధ్రవీకరణ పత్రాన్ని జారీ చేయాలి. కానీ, తహశీల్దార్ల స్థాయిలో ఈ ప్రక్రియ మందకోడిగా సాగుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పేరుకుపోతోంది.