తన నివాసంపై జరిగిన దాడికి సంబంధించి నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ తలపెట్టిన ‘వినతి యాత్ర’ పాదయాత్రను మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తాత్కాలికంగా వాయిదా వేశారు. గుంటూరులోని తన నివాసంలో పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమైన అనంతరం ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. త్వరలోనే పాదయాత్రకు సంబంధించి కొత్త తేదీని ప్రకటిస్తానని తెలిపారు.
గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... ఆగస్టు 7, 8 తేదీల్లో గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు రెండు రోజుల పాటు ఈ నిరసన పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వైసీపీ అదే సమయంలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్టీ అధిష్ఠానం చేపడుతున్న ముఖ్యమైన నిరసన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ, తన సొంత పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు అంబటి స్పష్టం చేశారు.
