నీట్‌ యూజీ-2026 పరీక్ష ఫలితాలపై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఒక్క రోజులో తన మార్కులు మూడుసార్లు మారిపోయాయని ఆరోపిస్తూ ఓ అభ్యర్థి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తొలుత 650 మార్కులు చూపించిన ఫలితాలు, తర్వాత 500కు, చివరకు 135కు పడిపోయాయని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించిన విద్యార్థి, తన అసలు ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని భద్రపరిచి స్వతంత్రంగా పరిశీలించాలని కోర్టును కోరాడు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది.

న్యాయవాది వినీత్‌ జిందాల్‌ ద్వారా దాఖలైన పిటిషన్‌లో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. పరీక్ష రాసిన సమయంలో తాను నింపిన ఓఎంఆర్‌ షీట్‌కు, ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో చూపించిన ఓఎంఆర్‌కు పొంతన లేదని విద్యార్థి ఆరోపించాడు. అందువల్ల తన అసలు ఓఎంఆర్‌ జవాబు పత్రంతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని, స్వతంత్రంగా పరిశీలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాడు.

పిటిషన్‌ ప్రకారం.. విద్యార్థి జూన్‌ 21న నిర్వహించిన నీట్‌ యూజీ-2026 రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యాడు. తాత్కాలిక, తుది ఆన్సర్‌ కీతో తన సమాధానాలను పోల్చి చూసుకున్న తర్వాత సుమారు 620 మార్కులు వస్తాయని అంచనా వేశాడు. అయితే జులై 16న ఫలితాలు విడుదలైనప్పుడు ఎన్‌టీఏ పోర్టల్‌లో మొదట 650 మార్కులు కనిపించాయని పేర్కొన్నాడు.

అనంతరం పోర్టల్‌ నుంచి లాగౌట్‌ అయి మళ్లీ లాగిన్‌ కావడంతో మార్కులు 500కు తగ్గిపోయాయని పిటిషన్‌లో తెలిపాడు. మరుసటి రోజు మళ్లీ చూసేసరికి అవే మార్కులు 135గా కనిపించాయని ఆరోపించాడు. ఒకే అభ్యర్థి ఫలితాలు ఇంత తక్కువ సమయంలో మూడుసార్లు మారడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించాడు. ఈ పరిణామం పరీక్షల మూల్యాంకన ప్రక్రియపై అనుమానాలు కలిగిస్తోందని పేర్కొన్నాడు.

తన అసలు ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని కోర్టు పర్యవేక్షణలో భద్రపరచాలని, స్వతంత్ర నిపుణులతో పరిశీలించే అవకాశం కల్పించాలని విద్యార్థి కోరాడు. ఈ అంశంపై ఎన్‌టీఏ నుంచి పూర్తి వివరాలు తీసుకోవాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.