అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు తొలి కార్యదర్శిగా ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి జగదీశ్ అఫాలేను నియమించారు. ఆలయ పరిపాలనతో పాటు ఆర్థిక లావాదేవీల్లోనూ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం, ట్రస్ట్‌ను ప్రశ్నించాయి. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
జగదీశ్ అఫాలేను ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలకు సంయుక్త అధికారిగా కూడా నియమించినట్లు సమాచారం. రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా ఈ నియామకం ఎలా ఉపయోగపడుతుందో ట్రస్ట్ వివరించాలని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ వర్మ కోరారు. చంపత్‌రాయ్‌పై ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్‌రాయ్ కూడా ట్రస్ట్‌పై విమర్శలు చేశారు. పవిత్ర లక్ష్యంతో ఏర్పాటైన ట్రస్ట్‌లో అవినీతి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. ట్రస్ట్‌ను పునర్వ్యవస్థీకరించి శంకరాచార్యులు సహా ప్రముఖ సన్యాసుల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. అయోధ్య ప్రజలకు శ్రీరాముడితో చారిత్రక అనుబంధం ఉందని, వారికీ ట్రస్ట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
రామమందిర ట్రస్ట్ తొలి కార్యదర్శిగా ఐఐటీ పూర్వ విద్యార్థి.. అక్రమాలు ఆగుతాయా అని ప్రతిపక్షాల ప్రశ్న..
